అనంతపురము నవంబర్ 10: బహుజన వేదిక న్యూస్
రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో ఏ ఐ ఎస్ బి, బిసివై విద్యార్థి విభాగం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ, బీసీవై విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళా విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, రాప్తాడులో చోటుచేసుకున్న సంఘటనతో పాటు, తాజాగా అనంతపురంలోని KSN డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థి కళాశాల భవనం నుంచి కిందకి పడడం వంటి ఘటనలు విద్యార్థుల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు.KSN డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థి ఘటనపై కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ బాధ్యతలను ఆయన ప్రశ్నించారు. కళాశాల ప్రారంభమయ్యే సమయానికి బాధ్యతాయుతమైన అధికారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థుల సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో భద్రతా పరిస్థితులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలని, విద్యాసంస్థల్లో అధికారుల పర్యవేక్షణ పెంచాలని కోరారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ బి నగర అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్ సాయి ,ఇంతియాజ్, నగర ఉపాధ్యక్షులు మనోజ్, కిరణ్ బీసీవై విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు...
