ప్రజలకే కాదు.. పశువుల దాహార్తి తీర్చాలన్న ఎమ్మెల్యే సునీత
ప్రతి మండలానికి రూ.కోటి ఇవ్వాలని విజ్ఞప్తి
సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయన్న సునీత
ఆర్టీసీ బస్సులు, సిబ్బంది సంఖ్య పెంచాలన్న ఎమ్మెల్యే సునీత
రాప్తాడు ఆగష్టు 20: బహుజన వేదిక న్యూస్
ఎల్-నినో ప్రభావంతో అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వాణి వినిపించారు. జీరో అవర్ లో ఆమె మాట్లాడుతూ అనంతపురం జిల్లాపై ఎల్-నినో ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో అయితే వెయ్యి అడుగులు బోరు వేసినా నీరు దొరకని పరిస్థితి ఉందన్నారు. ఇందులో అనంతపురం రూరల్ మండల పరిధిలో 70వేల ఓటర్లు ఉన్నారని.. అనేక కాలనీల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారని.. అయితే ఆ నీరు సరిపోవడం లేదన్నారు. అదనంగా మరిన్ని ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి సమస్య ఉందన్నారు. అందుకే కేవలం తాగునీటికే ప్రతి మండలానికి కోటి రూపాయలు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ప్రజలకే కాకుండా.. పశువులకు కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో గొర్రెలు, మేకలు ఎక్కువగా ఉన్నాయని.. వీటి దాహార్తి తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు కనీసం 30శాతం అయినా నీరు ఇవ్వాలని కోరారు. అప్పుడే భూగర్భ జలాలు కొంత వరకు ఉంటాయని.. పశువులకు నీరు అందుతుందన్నారు. మరోవైపు నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు, స్వర్ణ గ్రామ సచివాలయాల భవనాలు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని కోరారు..
సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ అన్నవి కేవలం 6 సంక్షేమ పథకాలు మాత్రమే కాదని.. అవి సామాన్య ప్రజల జీవితాలను మార్చేవని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అసెంబ్లీలో చివరి రోజు జరిగిన లఘు చర్చలో ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. తల్లికి వందనం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 లక్షల మంది తల్లులకు 10 వేల కోట్ల రూపాయలను 67 లక్షల మంది విద్యార్థులకు అందించారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 40వేల మందికి 52కోట్ల రూపాయలు అందించారన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరికీ ఇస్తామని గతంలో జగన్ రెడ్డి మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద పంటల సాగు చేసే సమయంలో రైతులకు 20 వేలు చొప్పున ఈ ఏడాది 47లక్షల మందికి సుమారు 9 వేల కోట్లు జమ చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 51 వేల మందికి 136 కోట్ల రూపాయలు సాయం అందిందన్నారు. దీపం పథకం ద్వారా 4 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారని.. సుమారు 2 వేల 7వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. యువగళం నిధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన ప్రకారం ముందుకెళ్తున్నారన్నారు. సుమారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 6లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా రెండేళ్లలో 65 లక్షల 50వేల మందికి 63 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు. అయితే కొత్త పింఛన్లు కావాలని చాలా మంది నుంచి విజ్ఞప్తి ఉందని.. వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారన్నారు. ఈ పథకం ఉద్దేశ్యం బాగున్నప్పటికీ.. ఒక్కో బస్సులో 60 నుంచి 80 మంది వరకు ప్రయాణిస్తున్నారని.. చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు స్టాపింగులలో నిలపడం లేదన్నారు. సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకే పెరిగిన ప్రయాణాల దృష్ట్యా కొత్త బస్సులు వెంటనే ఇవ్వాలని.. అలాగే సిబ్బందిని కూడా పెంచాలని ఎమ్మెల్యే సునీత కోరారు...