పామిడి సెప్టెంబర్ 08 బహుజన వేదిక న్యూస్
మండల పరిధిలోని వంకరాజుకాలువ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. గ్రామ పెన్న నది నుంచి నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పెన్నా నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించడం వల్ల గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాలతో ఇసుక తరలిస్తుండటంతో రహదారులు దెబ్బతినడంతో పాటు దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆరోపించారు. గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేసి, అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరారు.