ఎస్ఐఆర్ లో విచారణలు వేగవంతంగా పూర్తి చేస్తాం..
- : వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..
అనంతపురము, సెప్టెంబర్ 03 : బహుజన వేదిక న్యూస్
అమరావతి, వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) - 2026పై జిల్లా కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజ్, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా.. విచారణలకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1,22,601 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, రాబోయే 10 రోజుల్లో విచారణలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి రోజు 12 వేల వరకు విచారణలు చేపడుతున్నామని తెలిపారు. పార్క్డ్ ఫర్ ఫైనల్ పబ్లికేషన్ కు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల దరఖాస్తులను పార్కింగ్ చేయగా, మిగిలిన 3 నుండి 4 లక్షల దరఖాస్తులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఫారమ్-6కు సంబంధించి 11,327 దరఖాస్తులు, ఫారమ్-7కు సంబంధించి 242 దరఖాస్తులు, ఫారమ్-8కు సంబంధించి 9,044 దరఖాస్తులను ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. 48 గంటల కంటే ఎక్కువ సమయం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏవీ లేకుండా 'జీరో పెండెన్సీ' లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. NGSPలో పెండింగ్లో ఉన్న 15 ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అనంతపురం అర్బన్ మరియు తాడిపత్రి నియోజకవర్గాల్లో పెండెన్సీ ఎక్కువగా ఉన్నందున, ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే 10 రోజుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.