ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి
గిరిజనులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
ఎస్సీ ఎస్టీలకు స్మశాన వాటికలు నిర్మించాలి
అర్హులైన గిరిజనులకు పక్కా ఇల్లు, భూమి కేటాయించాలి
రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి
పామిడి, సెప్టెంబర్ 9: బహుజన వేదిక న్యూస్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఈ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందేటట్లు చూడాలని రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి అధికారులకు సూచించారు.
బుధవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి గారు అనంతపురం జిల్లా, పామిడి మండలం, పాల్యం తండాలో గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి మాట్లాడుతూ...

. అనంతపురం జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాలు ఉన్నాయని గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి గిరిజనులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు వారికే అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. చెయ్యని నేరానికి కొంతమంది పోలీస్ అధికారులు గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతోందని ఇలాంటి కేసులు తమ దృష్టికి వచ్చినట్లయితే పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఏమీ తెలియని గిరిజన అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరమన్నారు. విద్యా ఉద్యోగాలలో గిరిజనులకు కేటాయించిన కోటాలో ఎటువంటి అన్యాయం జరగరాదన్నారు. జిల్లాలో చాలామంది ఎస్సీ ఎస్టీలకు ఇప్పటివరకు కూడా స్మశాన వాటికలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను రెవెన్యూ అధికారులు సీరియస్గా తీసుకొని వెంటనే ఎస్సీ ఎస్టీలకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలన్నారు. జిల్లాలో చాలామంది గిరిజనులకు పక్కా ఇల్లు లేక పూరి గుడిసెలలో నివాసం ఉంటున్నారని ఇలాంటి వారందరికీ వెంటనే పక్కా ఇల్లు మంజూరు చేయించాలన్నారు.
మరియు అర్హులైన పేదలందరికీ భూ పంపిణీ కార్యక్రమంలో భూములు ఇవ్వాలన్నారు. గిరిజనలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెంటనే ఏకలవ్య మోడల్ స్కూల్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకొని గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విడుదల చేస్తున్నప్పటికీ అవి నిజమైన గిరిజనులకు అందడం లేదని ఈసారి వదిలే బ్యాక్లాగ్ పోస్టులలో గిరిజనులకు 100% న్యాయం జరిగేటట్లు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని చాలా గిరిజన తండాలలో అంగన్వాడీ స్కూల్స్ లేవని ఈ సమస్యను ఉన్నతాధికారులు గుర్తించి గిరిజన తండాలలో అంగన్వాడి స్కూల్స్ నిర్మించి అక్కడ మంచినీటి సమస్య లేకుండా చూడాలన్నారు. గిరిజన తండాలలో 24 గంటలు నిరంతరాయంగా కరెంటు ఉండేటట్లు చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రాబోయే రోజులలో గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరిగిన సహించేది లేదని ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు తెలిపారు. 
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు ఎస్టి కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప, కె మల్లేశ్వరరావు లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఈ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు, తహసిల్దార్ షర్మిల, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్, ఎస్టీ నాయకులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.