మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేసే ముందు అభ్యర్థుల కష్టాన్ని తెలుసుకోవాలి – పారదర్శక డీఎస్సీకి విజయాలే నిదర్శనం
శింగనమల సెప్టెంబర్ 03 : బహుజన వేదిక న్యూస్
మెగా డీఎస్సీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కుటుంబ నేపథ్యాలు, వారు పడిన కష్టం, వారి విజయ ప్రయాణాన్ని స్వయంగా తెలుసుకుంటే నియామక ప్రక్రియపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే అన్నారు.
డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన బి.పప్పూరు గ్రామానికి చెందిన ఆర్. మహా రాఘవేంద్ర రాజు – SGT, నాగ శివయ్య – పాఠశాల సహాయకుడు (సామాజిక), నారాయణస్వామి – పాఠశాల సహాయకుడు (జీవశాస్త్రం), నార్పల గ్రామానికి చెందిన ఎస్. ముబీనా – SGT అభ్యర్థుల ఇళ్లకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్వయంగా వెళ్లి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారు డీఎస్సీ కోసం ఎలా సిద్ధమయ్యారు, రోజుకు ఎన్ని గంటలు చదివారు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు, ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషి ఏమిటనే విషయాలను తెలుసుకున్నారు. వారి కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే, వీళ్లంతా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుగోలు చేసుకునే స్థితిలో లేరనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.ఈ నలుగురు అభ్యర్థులు సాధారణ, నిరుపేద, రైతు మరియు దినసరి శ్రామికుల కుటుంబాల నుంచి వచ్చి తమ ప్రతిభ, పట్టుదల, కష్టపడి చదివిన ఫలితంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. డబ్బు, పలుకుబడి కాకుండా ప్రతిభ, కష్టపడి చదివే తత్వం, పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని ఈ యువత విజయం నిరూపిస్తోందన్నారు. ఇలాంటి నిరుపేద కుటుంబాల యువత విజయాలను కూడా అనుమానాస్పదంగా చిత్రీకరించడం వారి కష్టాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.డీఎస్సీ నియామక ప్రక్రియలో ఎక్కడా అక్రమాలకు, అవకతవకలకు తావులేకుండా పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కుటుంబ నేపథ్యాలు, వారి ఆర్థిక పరిస్థితులు, వారు ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలను పరిశీలిస్తే డీఎస్సీపై చేస్తున్న రాజకీయ ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. అలాంటి వారు నేడు పారదర్శకంగా జరుగుతున్న డీఎస్సీ నియామక ప్రక్రియపై ఆరోపణలు చేయడం రాజకీయ అవకాశవాదమన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలను నిర్వహిస్తూ, ప్రశ్నపత్రాల భద్రత, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు.డీఎస్సీలో హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతలో అనవసరమైన అపోహలు సృష్టించవద్దని వైఎస్సార్సీపీ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే ఆధారాలతో ముందుకు వచ్చి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో డీఎస్సీ అంశంపై కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కోర్టులో జరిగిన పరిణామాలపై సంబంధిత నాయకులకు పూర్తి అవగాహన
ఉందన్నారు.డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన ఈ నలుగురు అభ్యర్థుల విజయమే నియామక ప్రక్రియ ఎంత పారదర్శకంగా, ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా జరిగిందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. నిరుపేద రైతు, దినసరి శ్రామికుల కుటుంబాల నుంచి వచ్చిన యువత తమ కష్టంతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాబోయే డీఎస్సీ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన యువతకు అర్హత, ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం సమాన అవకాశాలకు నిదర్శనమని, డీఎస్సీ నియామక ప్రక్రియపై చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పష్టం చేశారు.