అనంతపురము, సెప్టెంబర్ 08 : బహుజన వేదిక న్యూస్
మాతృ మరణాలు తగ్గింపులో స్వస్తి, ఫాగ్సి, ఆదను లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరించడం వల్ల కాన్పు సందర్భంగా జరిగే మాతృ మరణాలు బాగా తగ్గిపోయాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యులకు, స్టాఫ్ నర్స్ లకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రిలో ఎన్ని వసతులు ఉన్నా మాతృ సంరక్షణకు అవసరమైన సాంకేతికత లేకపోతే పరిపూర్ణత రాదని చెప్పారు.
మాతృ మరణాలు ఎక్కువగా కాన్పు సందర్భంలో జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో, సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. స్వస్తి తమ శిక్షణ సేవలు ప్రైవేట్ రంగానికి, ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా అందించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా.కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శిక్షణ పొందిన వైద్యులు తమ ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్వస్తి సాంకేతిక నిపుణులు డా.నాగేంద్ర, ట్రైనింగ్ టీం లీడర్ డా.స్టెఫీ, జిల్లా సమన్వయకర్త విజయ్ కుమార్, ఫ్యాగ్సి సంస్థ శిక్షకులు డాక్టర్ సుచిత్ర, డాక్టర్ హర్షిత, జిల్లా మాస్ మీడియా అధికారి నాగరాజు, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.