బాలికల పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలకు మంత్రి చొరవ టాయిలెట్ల నిర్మాణం, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు
మంత్రి సత్యకుమార్ హామీని కార్యరూపంలోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో హరీష్ బాబు పరిశీలన
ధర్మవరం, సెప్టెంబరు 29:బహు
ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థినులు స్వయంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురావడంతో, వెంటనే స్పందించిన మంత్రి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని తన సిబ్బందిని మరియు అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 25న ధర్మవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్న సందర్భంగా పాఠశాల విద్యార్థినులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
పాఠశాలలో యూరిన్ టాయిలెట్లు, ఇండివిడ్యువల్ లెట్రిన్ పిట్స్ పాతవి కావడంతో సరిగా వినియోగించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు మంత్రికి వివరించారు. అదేవిధంగా పాఠశాల ఎదురుగా వాహనాలు వేగంగా వెళ్తుండటంతో విద్యార్థినుల భద్రత దృష్ట్యా రెండు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థినుల సమస్యలను సానుకూలంగా పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, పాఠశాలలో అవసరమైన కొత్త యూరిన్ టాయిలెట్లు, ఇండివిడ్యువల్ లెట్రిన్ పిట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాల ఎదుట స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు మంగళవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుమనతో కలిసి పాఠశాలలోని పాత యూరిన్ టాయిలెట్లు, ఇండివిడ్యువల్ లెట్రిన్ పిట్స్‌ను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న వసతుల పరిస్థితి, విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల అవసరాలకు అనుగుణంగా కొత్త యూరిన్ టాయిలెట్లు, ఇండివిడ్యువల్ లెట్రిన్ పిట్స్ నిర్మాణానికి అవసరమైన పనులను త్వరితగతిన చేపట్టేందుకు కాంట్రాక్టర్‌తో చర్చించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌తో సమన్వయం చేసుకుని అవసరమైన నిర్మాణ పనులను గుర్తించి, వాటికి సంబంధించిన అంచనా వ్యయాన్ని (ఎస్టిమేషన్) త్వరగా సిద్ధం చేసి అందించాలని కాంట్రాక్టర్‌ను హరీష్ బాబు కోరారు.
ఎస్టిమేషన్ అందిన వెంటనే నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఎదురుగా రెండు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని హరీష్ బాబు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల వద్ద విద్యార్థినుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేలా అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని సూచించారు. విద్యార్థినులు తమ సమస్యలను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించడంపై పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి చేస్తున్నారని హరీష్ బాబు తెలిపారు.