వండిన తర్వాతే బియ్యం నాణ్యతపై అనుమానాలు.. తిరిగి తీసుకునేందుకు నిరాకరిస్తున్నారంటూ ప్రజల ఆవేదన
ప్యాకెట్‌పై ప్యాకింగ్ తేదీ, లాట్ నంబర్, మిల్లు వివరాలేవీ ఎందుకు లేవు? మా విలేకరి ప్రశ్నలకు డీఎం నుంచి స్పష్టత కరువు
కెఎన్ఎం / ఆర్ ఎన్ ఆర్ పేరుతో ఒకే ప్యాకెట్లో ఏ రకం బియ్యం సరఫరా చేస్తున్నారు?
కెఎన్ఎం 118, ఆర్ ఎన్ ఆర్ 15048 రెండింటినీ కలిపి విక్రయిస్తున్నారా? లేక ఈ రెండింటిలో ఏదో ఒక రకాన్ని అందిస్తున్నారా?
బియ్యం నాణ్యతను పరీక్షించిన ప్రయోగశాల ఏది?
ప్రతి బ్యాచ్‌కు నాణ్యతా పరీక్ష నివేదిక ఉందా?
బియ్యంలో బ్రోకెన్ రైస్ శాతం ఎంత?
బియ్యం సేకరణ నుంచి వినియోగదారుడికి చేరేవరకు నాణ్యతను ఎవరు పర్యవేక్షిస్తున్నారు?
అనంతపురము బ్యూరో, నవంబర్ 16: బహుజన వేదిక న్యూస్
సామాన్య ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన బియ్యం విక్రయ కార్యక్రమంపై అనంతపురం నగరంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అనంతపురం రైతుబజార్లో 26 కిలోల బియ్యం ప్యాకెట్‌ను రూ.1,300కు విక్రయిస్తున్నారు. కిలో రూ.50 ధరతో లభిస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ కూలీలు ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంటికి తీసుకెళ్లి వండిన తర్వాత బియ్యం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యమని భావించి కొనుగోలు చేసినప్పటికీ, వండిన తర్వాత అన్నం జిగురుగా మారుతోందని కొందరు చెబుతున్నారు. దీంతో అసలు విక్రయిస్తున్న బియ్యం ఏ రకానికి చెందినవనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సన్న బియ్యమని కొనుగోలు.. వండిన తర్వాత అసలు సమస్య!
బయట మార్కెట్లో సోనా మసూరి, బీపీటీ వంటి బియ్యం ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాలకు నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్కువ ధరకు సన్న బియ్యం అందిస్తోందన్న నమ్మకంతో ప్రజలు రైతుబజార్‌లోని విక్రయ కేంద్రానికి వెళ్తున్నారు. అయితే కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి వండిన తర్వాత ఆశించిన నాణ్యత కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇవి నిజంగా సన్న బియ్యమేనా? లేక వేరే రకానికి చెందిన బియ్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వినియోగదారులు దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా కనిపించేలా విక్రయిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బియ్యం నమూనాలను పరీక్షించిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తిరిగి తీసుకోమంటే నిరాకరణ.. సామాన్యుల ఇబ్బందులు
కొనుగోలు చేసిన బియ్యం నాణ్యత నచ్చక తిరిగి ఇచ్చేందుకు విక్రయ కేంద్రానికి వెళ్తే నిర్వాహకులు అంగీకరించడం లేదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఆధార్ వివరాలతో ఆన్లైన్లో నమోదు చేసి బియ్యం అందజేశామని, ఒకసారి విక్రయించిన తర్వాత తిరిగి తీసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలు తమ కష్టార్జితంలో రూ.1,300 వెచ్చించి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికి తీసుకెళ్లి వండిన తర్వాత నాణ్యతపై అసంతృప్తి కలిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నాణ్యత లోపం ఉన్నట్లు తేలితే బియ్యాన్ని తిరిగి తీసుకుని మార్పిడి చేసే అవకాశం ఎందుకు కల్పించడం లేదని నిలదీస్తున్నారు.
రూ.50కే కిలో.. నాణ్యతకు ఎవరు హామీ?
ప్రభుత్వం విక్రయిస్తున్న బియ్యం నిజంగా ఏ రకానికి చెందినవి? వాటి నాణ్యతా ప్రమాణాలు ఏమిటి? సోనా మసూరి లేదా బీపీటీ వంటి సన్న బియ్యమా? ఏ మిల్లులో ప్రాసెసింగ్ చేశారు? బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు? అనే ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించడం అభినందనీయమే అయినప్పటికీ, వారు చెల్లించిన ప్రతి రూపాయికి తగిన నాణ్యత కలిగిన సరుకును అందించడం కూడా ప్రభుత్వ బాధ్యత. కేవలం ధర తక్కువగా ఉందనే కారణంతో నాణ్యతపై రాజీ పడకూడదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
డీఎం వివరణ.. విలేకరి ప్రశ్నలకు స్పష్టత కరువు!
బియ్యం నాణ్యతపై వినియోగదారుల నుంచి వస్తున్న అసంతృప్తి నేపథ్యంలో మా విలేకరి సివిల్ సప్లైస్ డీఎం గుమ్మళ్ల రమేష్ రెడ్డిని నేరుగా సంప్రదించి వివరణ కోరారు. అనంతపురం రైతుబజార్లో ఇప్పటివరకు సుమారు 8 వేల మందికి బియ్యం విక్రయించామని, తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని డీఎం తెలిపారు. బియ్యంలో నిర్ణీత పరిమాణంలో ఖనిజాలు కలుపుతామని, తాము విక్రయిస్తున్నది ఫోర్టిఫైడ్ బియ్యం కాదని, నాణ్యమైన సన్న బియ్యమే అందిస్తున్నామని ఆయన వివరించారు. అయితే వండిన తర్వాత బియ్యం జిగురుగా మారుతోందని ప్రజలు చెబుతున్న విషయాన్ని విలేకరి ప్రస్తావించగా, కొత్త స్టాక్ లారీ వచ్చినప్పుడు కొన్నిసార్లు అలా జరిగే అవకాశం ఉందని ఆయన సమాధానమిచ్చారు.
ప్యాకెట్‌పై వివరాలేవి? నాణ్యతా పరీక్షలు ఎక్కడ?
బియ్యం ప్యాకెట్లపై ప్యాకింగ్ తేదీ, లాట్ నంబర్, గడువు తేదీ, తయారు చేసిన మిల్లు పేరు, బియ్యం సేకరించిన ప్రాంతం వంటి వివరాలు స్పష్టంగా ఎందుకు లేవని మా విలేకరి డీఎంను ప్రశ్నించారు. బియ్యం నాణ్యతను ఏ ప్రయోగశాలలో పరీక్షించారు? పరీక్షల నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? నాణ్యతపై ఫిర్యాదు వస్తే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలను కూడా లేవనెత్తారు. అయితే ఈ అంశాలపై డీఎం నుంచి స్పష్టమైన వివరణ లభించలేదు. సుమారు 8 వేల మందికి బియ్యం విక్రయించామని చెబుతున్న అధికారులు, ప్రజల నుంచి వస్తున్న నాణ్యతా సందేహాలను కూడా అంతే బాధ్యతతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
నమూనాలు పరీక్షించి.. ప్రజలకు నిజాలు వెల్లడించాలి!
అనంతపురం రైతుబజార్లో విక్రయిస్తున్న బియ్యం ప్యాకెట్లను జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు తక్షణమే పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. బియ్యం నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించాలి. వాటి రకం, నాణ్యత, ప్రాసెసింగ్ వివరాలు, సరఫరా చేసిన మిల్లుల వివరాలను ప్రజలకు వెల్లడించాలి. నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పరీక్షల్లో నాణ్యతా లోపాలు నిర్ధారణ అయితే బాధితులకు బియ్యం మార్పిడి లేదా తగిన పరిష్కారం కల్పించాలి.
పేద ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ విక్రయ కార్యక్రమం నిజమైన ప్రయోజనం చేకూర్చాలే తప్ప, కొనుగోలు చేసిన తర్వాత నాణ్యతపై ఆందోళనకు గురిచేయకూడదు. జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాలని వినియోగదారులు కోరుతున్నారు.
