అనంతపురం అర్బన్ కూటమి పార్టీ నాయకుల పిలుపు
నగరంలో కూటమి పార్టీల సర్వసభ్య సమావేశం
ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన నాయకులు
టికెట్లు ఎవరికిచ్చినా అన్ని స్థానాలు గెలిపించి చూపిస్తాం...ఎమ్మెల్యే దగ్గుపాటి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు..శ్రీనివాస్ రెడ్డి
వైసిపికి ఓటు వేస్తే మళ్లీ వినాశనమే.. ఏరాసు ప్రతాప్ రెడ్డి
సమన్వయంతో ముందుకు సాగుదాం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు
అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం.. బీజేపీ నాయకులు సందిరెడ్డి శ్రీనివాసులు , కొనకొండ్ల రాజేష్
అనంతపురము అర్భన్ 29: బహుజన వేదిక న్యూస్
సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అంతకుమించిన విజయాన్ని సాధిద్దామని అనంతపురం అర్బన్ నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురం నగర శివారులోని ఆర్కే ఫంక్షన్ హాల్లో కూటమి పార్టీల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్నికల పరిశీలకుడు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి గారు, టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి గారు, అనంతపురం నియోజకవర్గ టిడిపి పరిశీలకు దేవేంద్రప్ప గారు, బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారితో పాటు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ అనంతపురంకి కొత్తగా వచ్చిన తనను గత సార్వత్రిక ఎన్నికల్లో 23 వేల మెజార్టీతో గెలిపించడానికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, టిడిపి, బిజెపి, జనసేన, నాయకులేనన్నారు. ఆరోజు అందరం కలిసి అంత ఐక్యంగా పనిచేసినందు వల్లే భారీ స్థాయిలో విజయం లభించిందన్నారు. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా అదే స్ఫూర్తితోనే ముందుకు వెళ్దామని ఆయన పిలుపునిచ్చారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ఒక విధ్వంసపూరిత వాతావరణంలో జరిగాయని అభ్యర్థులను పోలింగ్ బూతుల నుంచి బయటకు తీసుకొచ్చి స్టేషన్ లో నిలబెట్టి వైసిపి నాయకులు ఓట్లు వేయించుకున్నారన్నారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని రెండేళ్లలో నగరంలో మనం ఎంతో అభివృద్ధి, సంక్షేమం చేశామని.. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుదామన్నారు. డివిజన్ దగ్గరనుంచి మేయర్ వరకు సీట్లు ఆశించే వారు ఎంతో మంది ఉన్నారని.. అయితే ఏ పార్టీ వారికి అధిష్టానం టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. మొత్తం 62 డివిజన్లలోనూ విజయం సాధించేలా ముందుకు వెళ్దామన్నారు. అలాగే పంచాయతీలోని ప్రతి వార్డులో కూడా మన జెండానే ఎగరాలన్నారు. అయితే మనమంతా ఒక కుటుంబంలా ఉంటామని... కుటుంబంలో చిన్నపాటి విభేదాలు సహజంగా ఉంటాయని.. వాటిని కలిసి చర్చించుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా మన మన మధ్యనే చర్చలు జరగాలని.. వీలైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దని దగ్గుపాటి ప్రసాద్ గారు సూచించారు. జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 62 డివిజన్లలోనూ గెలిచే విధంగా కూటమి పార్టీ నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది అధిష్టానం పూర్తిగా గమనిస్తోందని దీనిని ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. మన మూడు పార్టీలు ఐక్యంగా ఉన్నప్పుడు పొత్తు ధర్మం పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు త్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. పార్టీ అధిష్టానం అన్ని పరిశీలించి ఎవరైతే సరైన అభ్యర్థి అన్నది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎవరికి టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా అంతా సమిష్టిగా పని చేయాలన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. వైసిపికి కనీసం ఎక్కడా డిపాజిట్లు కూడా రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పొరపాటున వైసిపి గెలిస్తే అభివృద్ధి మళ్లీ కుంటు పడుతుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. గుజరాత్ తరహాలో నిర్దిష్టంగా 15 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వ అధికారంలో ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇవి కొనసాగాలంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అలాగే ఇతర స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించాలని అన్నారు. ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికైనా స్పష్టత ఉందా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నది కూడా ఆయన వివరించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజావేదికను కూల్చారన్నారు. ముస్లిం మైనార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కోసం ఈ రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేశారని వివరించారు. ముస్లింలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట విని మరోసారి మోసపోవద్దని ఆయన సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 62 డివిజన్లో మనం గెలవడమే కాకుండా వైసిపికి ఎక్కడా డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ఉందని ఏరాసు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వైసీపీ అంటేనే కూల్చివేయడం, దోచుకుని దాచుకోవడం అని విమర్శించారు. అలాంటి పార్టీకి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని ఆయన సూచించారు. పొరపాటున కూడా వారికి అవకాశం ఇస్తే రాష్ట్రంలో మరోసారి విధ్వంసం తప్పదని పేర్కొన్నారు.