ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ రామక్షేత్రాల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఆలయానికి ఆధ్యాత్మికంగానే కాకుండా తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది.
ముఖ్యంగా మహాకవి బమ్మెర పోతనామాత్యులకు ఈ క్షేత్రంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం పోతనామాత్యులు ఒంటిమిట్టలోనే ఆంధ్ర మహాభాగవతాన్ని రచించి, ఆ గ్రంథాన్ని ఇక్కడ కొలువైన శ్రీ కోదండరామస్వామికి అంకితం చేశారు. అందుకే ఈ ఆలయంలో పోతనామాత్యుల విగ్రహాన్ని కూడా చూడవచ్చు.
ఈ ఆలయానికి ఏకశిలానగరం అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ గర్భగుడిలో సీతమ్మవారు, శ్రీరాముడు, లక్ష్మణస్వామి ముగ్గురి విగ్రహాలు ఒకే శిలపై చెక్కబడి ఉంటాయి. ఒకే రాతిపై ఇంత అందంగా మలిచిన ఈ విగ్రహాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
ఈ ఆలయ నిర్మాణ చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శాసనాలు, నిర్మాణ శైలిని బట్టి 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు వివిధ దశల్లో ఈ ఆలయం అభివృద్ధి చెందినది.ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో ఆలయానికి ఎంతో ప్రాధాన్యత లభించింది.
ఇక్కడి అద్భుతమైన రంగమండపం, 32 స్తంభాలు, వాటిపై చెక్కిన శిల్పాలు చూస్తే అప్పటి శిల్పకళా నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
మరో విశేషం ఏమిటంటే.. 1555, 1558 సంవత్సరాలకు చెందిన శాసనాలు ఈ ఆలయంలో లభించాయి. ఇవి అప్పటి రాజులు, దాతలు ఈ ఆలయానికి చేసిన భూదానాల గురించి తెలియజేస్తున్నాయి.
17వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ కూడా ఈ ఆలయాన్ని చూసి ప్రశంసించారు.
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఒంటిమిట్ట కోదండరామస్వామి క్షేత్రం మన కడప జిల్లాలో ఉండటం నిజంగా మనందరికీ గర్వకారణం.
తెలుగు భాగవతాన్ని మనకు అందించిన పోతనామాత్యుల సాహిత్య అనుబంధం ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా?