పరిహారం ఇవ్వకుండానే గతంలో పనులు.. మట్టిపనులకే పరిమితమైన ప్రాజెక్టు
చర్చిoచిన మంత్రులు సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు
ఇంజనీర్లు బృందo ద్వారా అధ్యయనం చేయించాలని నిర్ణయం
మంత్రులను కలుసుకున్న బాధిత రైతులు
ముదిగుబ్బ,ఆగస్టు 19: బహుజన వేదిక న్యూస్
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పాడరాళ్లపల్లి రైతుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే జిల్లేడుబండ రిజర్వాయర్ పనులు చేపట్టారని, పనులు కూడా పూర్తిస్థాయిలో సాగకుండా కేవలం మట్టిపనులకే పరిమితమయ్యాయని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. రిజర్వాయర్ ఎత్తు పెంపుతో ప్రస్తుతం సాగులో ఉన్న భూములు, గ్రామం ముంపునకు గురయ్యే పరిస్థితిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం శాసనసభ ప్రాంగణంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో చర్చించారు. పాడరాళ్లపల్లి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఇంజినీర్ల బృందాన్ని గ్రామానికి పంపాలని నిర్ణయించారు.
18 ఏళ్లుగా సాగు.. ఇప్పుడు ముంపు భయం
ముదిగుబ్బకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని పాడరాళ్లపల్లి పరిసరాల్లో జిల్లేడుబండ వాగుపై సుమారు 18 ఏళ్ల క్రితం రిజర్వాయర్ నిర్మించారు. అప్పట్లో కొంత భూమి ముంపునకు గురైంది. మిగిలిన భూములకు సాగునీరు అందడంతో రైతులు ఏటా రెండు, మూడు పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇప్పుడు రిజర్వాయర్ ఎత్తు పెంచే ప్రతిపాదనతో మిగిలిన సాగుభూములు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన భూములను కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
పరిహారం లేకుండానే పనులా?
గతంలో ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటికీ ప్రభావిత రైతులకు నష్టపరిహారం చెల్లింపు, పునరావాస చర్యలు పూర్తికాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకుండా ప్రధానంగా భూమి పనులకే పరిమితమైందని పేర్కొంటున్నారు. ఇప్పుడు రిజర్వాయర్ ఎత్తు పెంపు చేపడితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రిజర్వాయర్ కరకట్ట గ్రామానికి సమీపంగా నిర్మిస్తే నీటి నిల్వ గ్రామం కంటే ఎత్తులో ఉండే అవకాశం ఉందని, వర్షాలు, వాగులు, వంకల నుంచి వచ్చే నీరు గ్రామంలో నిలిచిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం, పునరావాసం కోరుతున్న రైతులుముంపునకు గురయ్యే భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్లు కోల్పోయే వారికి పునరావాసం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పుట్టపర్తి రహదారి సమీపంలో ఇంటి స్థలాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంజినీర్ల బృందంతో క్షేత్రస్థాయి పరిశీలన రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న మంత్రులు.. ముందుగా ఇంజినీర్ల బృందాన్ని పాడరాళ్లపల్లికి పంపి రిజర్వాయర్ ఎత్తు పెంపుతో కలిగే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించనున్నారు. గ్రామం, సాగుభూములు, ఇళ్లు, నీటి ప్రవాహ మార్గాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. పరిశీలన నివేదిక ఆధారంగా రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. గతంలో పరిష్కారం కాని సమస్యకు క్షేత్రస్థాయి పరిశీలనతో పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బాధిత రైతులు శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు శ్రీ సత్య కుమార్ రామానాయుడును కలుసుకొని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.