ధర్మవరం ఆర్డీటీ గ్రౌండ్లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 ఘన ప్రారంభం
యువతలో క్రీడాస్ఫూర్తికి ఊతం.. అభివృద్ధి స్ఫూర్తికి అటల్జీ ఆదర్శం...
అటల్జీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి...
స్వర్ణ చతుర్భుజితో దేశ అభివృద్ధికి అటల్జీ బాట...
క్రీడలతో యువతకు ఆరోగ్యం.. క్రమశిక్షణ.. నాయకత్వం అలవర్చుకోవాలి...
----ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి, డీఎస్పీ జగన్నాథ్ రాజు, హరీష్ బాబు
ధర్మవరం, ఆగస్టు 20: బహుజన వేదిక న్యూస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ధర్మవరం ఆర్డీటీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి, ధర్మవరం డీఎస్పీ బి.వి. జగన్నాథ్ రాజు, మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడం, యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమన్వయం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి సత్యకుమార్ యాదవ్ లా జన్మదినాల సందర్భంగా ఇలాంటి క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా, గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, యువతను ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన, సానుకూల ఆలోచనలు కలిగిన శక్తిగా తీర్చిదిద్దే సాధనమని అన్నారు. ధర్మవరం ప్రాంతంలోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు.
అభివృద్ధి దారిలో అటల్జీ చూపిన మార్గం....

ఈ సందర్భంగా వారు మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకున్నారు. దేశ మౌలిక వసతుల అభివృద్ధికి అటల్జీ ప్రభుత్వం వేసిన బలమైన పునాదులను ప్రస్తావిస్తూ, దేశాన్ని రహదారులతో అనుసంధానించాలనే దూరదృష్టితో ఆయన హయాంలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (స్వర్ణ చతుర్భుజి) – నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (NHDP) కు శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగా 5,846 కిలోమీటర్ల గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ద్వారా ఢిల్లీ–ముంబై–చెన్నై–కోల్‌కతా నగరాలను అనుసంధానించే నాలుగు ప్రధాన రహదారి మార్గాల అభివృద్ధికి బాటలు వేశారని గుర్తుచేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలను కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కు అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గ్రామాలకు పక్కా రహదారుల ద్వారా అనుసంధానం కల్పించాలనే ఆలోచనకు అటల్జీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పలుమార్లు గుర్తుచేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. దేశ రవాణా వ్యవస్థను ఆధునికీకరించడమే కాకుండా, ఆర్థిక అభివృద్ధికి మౌలిక వసతులు ఎంత కీలకమో అటల్జీ తన పాలనలో చూపించారని అన్నారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్, గ్రామీణ రహదారుల అనుసంధానం, ఢిల్లీ మెట్రోకు ప్రారంభ దశలో అందించిన ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనాలని పేర్కొన్నారు. అటల్జీ ఆలోచనల్లో దేశ నిర్మాణం, యువతకు అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, సుపరిపాలనకు ఉన్న ప్రాధాన్యాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా యువతలో అదే క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ధర్మవరం అభివృద్ధికి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక ప్రాధాన్యం...

మంత్రి సత్యకుమార్ యాదవ్, నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం, యువతకు అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వారు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ధర్మవరం నియోజకవర్గంలో కూడా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు, యువతకు క్రీడా అవకాశాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ధర్మవరం యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ఆ ప్రతిభను గుర్తించి సరైన వేదికలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందని అన్నారు. అందుకే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కూడా ప్రోత్సాహం అందిస్తూ, యువతను సానుకూల దిశలో నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అటల్జీ దేశ అభివృద్ధికి మౌలిక వసతులను బలపరిచినట్లే, నేటి నాయకత్వం కూడా అభివృద్ధిని ప్రజల గడపకు చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోందని వారు అన్నారు. అటల్జీ చూపిన అభివృద్ధి మార్గం.. మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ సంకల్పం.. సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ధర్మవరం అభివృద్ధి అనే స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఉత్కంఠభరితంగా తొలి మ్యాచ్.. డ్రాగన్ XI విజయం....
టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన అనంతరం ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి గారు టాస్ వేసి డ్రాగన్ XI – రైజింగ్ స్టార్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు.మొదటి మ్యాచ్‌లో డ్రాగన్ XI జట్టు నిర్ణీత ఓవర్లలో 155/5 పరుగులు సాధించగా, రైజింగ్ స్టార్ జట్టు 86/5 పరుగులు చేసింది. దీంతో డ్రాగన్ XI జట్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన డ్రాగన్ XI జట్టు ఆటగాడు వెంకీ వెంకీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.అనంతరం స్టార్ XI – జై శ్రీరామ్ జై హనుమాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టార్ XI జట్టు 122/8 పరుగులు సాధించగా, జై శ్రీరామ్ జై హనుమాన్ జట్టు 77/8 పరుగులు చేసింది. దీంతో స్టార్ XI జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన స్టార్ XI జట్టు ఆటగాడు లోకేష్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నమెంట్ ప్రారంభంతో ఆర్డీటీ గ్రౌండ్లో క్రీడా సందడి నెలకొంది. యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనగా, క్రీడాభిమానులు మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకించారు. రాబోయే మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. క్రీడల ద్వారా యువతకు ఆరోగ్యం.. పోటీ ద్వారా ప్రతిభకు పదును.. స్ఫూర్తి ద్వారా సమాజానికి దిశానిర్దేశం అనే లక్ష్యంతో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3ను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాంభూపాల్ రెడ్డి, డీఎస్పీ బీవీ జగన్నాథ్ రాజు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, బిజెపి పట్టణ అధ్యక్షులు జింక చంద్ర, రూరల్ బిజెపి అధ్యక్షులు గొట్లూరు చంద్ర, బిజెపి నాయకులు అంబటి సతీష్, జూటూరు వెంకటేష్, పోతుకుంట రాజు, నరేష్, పూలకుంట్ల మహేష్, ప్రకాష్ గౌడ్, అశ్వత్ నారాయణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.