ధర్మవరం, సెప్టెంబర్ 08:బహుజన వేదిక న్యూస్
యువతలోని నైపుణ్యం, ప్రతిభకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ధర్మవరం పట్టణంలోని సిఎన్బీ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘన విజయం సాధించింది. సంస్కృతి సేవా సమితి సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాకు 135 ప్రతిష్టాత్మక కంపెనీలు హాజరై ఉద్యోగ అవకాశాలు కల్పించగా, 4,100 మందికి పైగా నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 1,146 మందికి పైగా అభ్యర్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, మాజీ డీఆర్డీఓ చైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారు జి. సతీష్ రెడ్డి, సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు.
ఉద్యోగం భవిష్యత్తుకు తొలి మెట్టు: సత్యకుమార్

మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ యువతకు విద్య, నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు అందించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత యువతకు విద్యా అవకాశాలతో పాటు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.“ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు.. అది మన భవిష్యత్తుకు తొలి మెట్టు” అని మంత్రి పేర్కొన్నారు. జీవితంలో ఒక్కసారిగా ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యం కాదని, ప్రతి ఉద్యోగం ద్వారా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కాలని యువతకు సూచించారు. ఉద్యోగం వచ్చిన వెంటనే నచ్చలేదని వదిలేయకుండా కొంతకాలం పనిచేసి అనుభవం సంపాదించాలని కోరారు.
యువత సోషల్ మీడియా, రీల్స్‌లో విలువైన సమయాన్ని వృథా చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. అవసరమైతే సొంత ఊరిని దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
గత జాబ్ మేళాలో 2,400 మందికి ఉద్యోగాలు
ధర్మవరంలో గతంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయాన్ని మంత్రి గుర్తుచేశారు. 2025 జనవరి 9న నిర్వహించిన జాబ్ మేళాలో 102 కంపెనీలు పాల్గొనగా, 5,200 మంది అభ్యర్థులు హాజరై 2,400 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు అని తెలిపారు. ప్రస్తుత జాబ్ మేళాను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం, సంస్కృతి సేవా సమితి, పారిశ్రామిక సంస్థల సహకారం తీసుకున్నామని చెప్పారు. టీసీఎస్, యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కియా ఇండియా, టాటా మోటార్స్, ఫాక్స్‌కాన్, హ్యుందాయ్ మొబిస్, అరబిందో ఫార్మా, హెటిరో, అపోలో ఫార్మసీస్, డీమార్ట్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొనడం యువతకు గొప్ప అవకాశమన్నారు.
ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఫార్మా, ఆటోమొబైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాలకు చెందిన కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.
సత్యసాయి జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారుతుంది: సతీష్ రెడ్డి

మాజీ డీఆర్డీఓ చైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారు జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఒక నియోజకవర్గంలో రెండేళ్ల వ్యవధిలో రెండోసారి ఇంత భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రముఖ జాతీయ సంస్థలు ధర్మవరానికి వచ్చి స్థానిక యువతను నేరుగా ఎంపిక చేయడం గొప్ప అవకాశమని తెలిపారు.
జాబ్ మేళాకు కంపెనీల నుంచి వచ్చిన స్పందనను బట్టి దాదాపు 200 కంపెనీల వరకు ఉద్యోగాల కల్పనకు ఆసక్తి చూపాయని, భవిష్యత్తులో దశలవారీగా మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించవచ్చని చెప్పారు.
రాబోయే పదేళ్లలో సత్యసాయి జిల్లా దేశంలోని ప్రముఖ పారిశ్రామిక జిల్లాల్లో ఒకటిగా ఎదగనుందని సతీష్ రెడ్డి తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రక్షణ రంగ పరిశ్రమలు, ఏరోస్పేస్ ప్రాజెక్టులు, ఇతర భారీ పెట్టుబడుల ద్వారా జిల్లాలో వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్థానిక యువత నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
నైపుణ్యం ఉంటే ఉద్యోగం ఖాయం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం నుంచి పారిశ్రామిక, ఉపాధి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని అన్నారు. కియా పరిశ్రమతో ఆటోమొబైల్ రంగంలో అనుబంధ పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. రక్షణ, ఏరోస్పేస్, టెక్స్టైల్ తదితర రంగాల్లో పెట్టుబడులు వస్తున్నందున భవిష్యత్తులో యువతకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. విద్యార్హతతో పాటు కమ్యూనికేషన్, టెక్నికల్, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు తప్పనిసరిగా పెంచుకోవాలని సూచించారు.
ఉద్యోగం వచ్చిన వెంటనే వదిలేయకుండా కనీసం ఆరు నుంచి ఏడు నెలలు పనిచేసి అనుభవం సంపాదించుకోవాలని, ఉద్యోగంతో పాటు ఉన్నత విద్య, కంప్యూటర్ కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ వంటి అదనపు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
స్థానికంగానే మరిన్ని ఉద్యోగ అవకాశాలు

ధర్మవరం, సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో రక్షణ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫార్మా రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పారిశ్రామిక పార్కులు, పుట్టపర్తి ప్రాంతంలో ఏరోస్పేస్ కార్యకలాపాలు, ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ వంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, పీఎం విశ్వకర్మ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి, రుణాలు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి వివరించారు.“ఉద్యోగం కోసం ఎదురుచూడటమే కాదు.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత ఎదగాలి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.. వ్యసనాలకు దూరంగా ఉండండి.. నిరాశకు లోనుకాకండి” అని మంత్రి యువతకు పిలుపునిచ్చారు.
నియామక పత్రాల అందజేత

జాబ్ మేళాలో జరుగుతున్న ఇంటర్వ్యూలను మంత్రి సత్యకుమార్ యాదవ్, జి. సతీష్ రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వయంగా పరిశీలించి కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. వివిధ ఉద్యోగాలకు ఎంపికైన యువతకు వారు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులను సత్కరించారు.
ధర్మవరంలో యువతకు ఉద్యోగాల కల్పన ఒక్కరోజు జాబ్ మేళాతో ముగిసే కార్యక్రమం కాదని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో కంపెనీలను తీసుకొచ్చి, నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేసి 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి విద్యార్హతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించేలా నిరంతర కృషి కొనసాగిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జేడీఎం సీడ్ యాప్ గీతా రాణి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ, ధర్మవరం ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ధర్మవరం తహసీల్దార్ దేవరాజ్, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పాండు, బీజేపీ నాయకులు, అధికారులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.