ధర్మవరం, సెప్టెంబర్ 08: బహుజన వేదిక న్యూస్
సుదీర్ఘకాలంగా వాల్మీకి బోయ సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఎస్టీ పునరుద్ధరణ అంశంపై నేడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, వాల్మీకి సామాజిక వర్గ నాయకులతో ఎన్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు మంత్రి గారికి తమ గోడును వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కులం రెండు రిజర్వేషన్లుగా (బీసీ-ఏ మరియు ఎస్టీ) ఉండటం వలన వాల్మీకి బోయ సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం వల్ల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ గారే తమ చిరకాల ఆకాంక్ష అయిన ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లి తగు న్యాయం చేయాలని వాల్మీకి నాయకులు కోరారు.
వాల్మీకి నాయకులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మీ సమస్యను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. వాల్మీకి బోయ సామాజిక వర్గానికి న్యాయం జరగాలన్న మీ ఆకాంక్షను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లా దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైన స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఈ అంశంపై చర్చించి, వాల్మీకి బోయల ST హోదా అంశానికి పరిష్కారం లభించేలా నా వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. వాల్మీకి బోయ సామాజిక వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వాల్మీకి సామాజిక వర్గ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.