
ఉల్లికల్లు ఇసుక కాలువ వద్ద 300 టన్నుల అక్రమ ఇసుక డంపులు సీజ్
పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల సంయుక్త దాడులు..
5 కేసులు, 9 వాహనాలు స్వాధీనం
శింగనమల, ఆగస్టు 18: బహుజన వేదిక న్యూస్
శింగనమల మండల పరిధిలో పెన్నా నది, ఇసుక కాలువ ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణాపై బహుజన వేదిక తెలుగు జాతీయ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. అక్రమ ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలన్న ప్రజల డిమాండ్ల నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల అధికారులు సమన్వయంతో రంగంలోకి దిగారు. ఉల్లికల్లు ఇసుక కాలువ పరిసరాల్లో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సుమారు 300 టన్నుల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శింగనమల సీఐ రాగిరి రామయ్య, ఎస్ఐ ప్రసాద్‌తో పాటు రెవెన్యూ, గనుల శాఖల అధికారులు ఉల్లికల్లు ఇసుక కాలువ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక డంపులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి, సీజ్ చేసిన ఇసుకను రెవెన్యూ, గనుల శాఖల సంయుక్త ఆధీనంలో భద్రపరిచారు.
అక్రమ ఇసుకపై ఉక్కుపాదం
ఇసుక నిల్వలు, తవ్వకాలు, రవాణా జరుగుతున్న ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేయడం, అక్రమంగా తవ్వకాలు చేపట్టడం, రవాణాకు పాల్పడటం వంటి అంశాలపై ఆరా తీశారు. అక్రమ ఇసుక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.ఇప్పటికే శింగనమల పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక దందాకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో 5 క్రిమినల్ కేసులు నమోదు చేసి, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్న వారిలో ఆందోళన నెలకొంది.ఎంతటి వారైనా ఉపేక్షించం
అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టినా, నిల్వలు ఏర్పాటు చేసినా, అక్రమంగా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ రాగిరి రామయ్య హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల సమన్వయంతో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.
బహుజన వేదిక కథనానికి స్పందన
శింగనమల మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై బహుజన వేదిక తెలుగు జాతీయ దినపత్రిక ప్రజా సమస్యను నిరంతరం వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత శాఖలు స్పందించేలా చేయడంలో మీడియా బాధ్యతను ఈ పరిణామం మరోసారి చాటిచెప్పింది.
అక్రమ ఇసుక దందాపై అధికారులు చర్యలు చేపట్టడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం దాడులు, సీజ్లకే పరిమితం కాకుండా ఇసుక అక్రమ తవ్వకాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్
పెన్నా నది, ఇసుక కాలువలు, ఇసుక నిల్వ ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన ప్రాంతాల్లో శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ తవ్వకాల వెనుక ఉన్న అసలు నిర్వాహకులను కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బహుజన వేదిక కథనానికి స్పందించి అధికారులు చేపట్టిన తాజా చర్యలు స్వాగతించదగ్గవేనని, ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలు, రవాణాపై నిరంతర తనిఖీలు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.









