జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీటి సరఫరా పనులను రెండు నెలల్లో వేగవంతంగా పూర్తి చేయాలి..

జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీటి సరఫరా పనులను రెండు నెలల్లో వేగవంతంగా పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

జల్ జీవన్ మిషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్రాగునీరు అందించాలి.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత..

అనంతపురము, సెప్టెంబర్ 03 : బహుజన వేదిక న్యూస్

అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం రాప్తాడు నియోజకవర్గంలో త్రాగునీటి సరఫరా కోసం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులపై ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్ఈ, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో చేపట్టిన పనుల పురోగతి, ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఎక్కడెక్కడ పనులు చేపట్టాలి, తదితర అంశాలపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సమీక్ష చేశారు.ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వీలైనంత త్వరగా గ్రామాలకు త్రాగునీరు అందించాలన్నారు. జల జీవన్ పథకం కింద అనంతపురము రూరల్ మండలంలో సాయి పావని కంపెనీ 40 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు రూ.18 కోట్ల పనులు చేశారని, అందులో ఇప్పటివరకు 15 కోట్ల 50 లక్షల రూపాయల బిల్స్ ఇచ్చారని, 2 కోట్ల 50 లక్షలు బిల్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో ఇంకా 22 కోట్ల రూపాయల పనులు చేయాలన్నారు. ఆత్మకూరు మండలంలో సరస్వతి కంపెనీ 50 కోట్ల 43 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించగా, రూ.38 కోట్ల పనులు చేశారని, వారికి 34 కోట్ల బిల్స్ ఇచ్చారని, ఇంకా 12 కోట్ల 43 లక్షల రూపాయల పనులు చేయాలన్నారు. వారు ఆత్మకూరులో 10 గ్రామాలు, అనంతపురము రూరల్ పరిధిలో 4 గ్రామాలు, రాప్తాడులో 6 గ్రామాలలో పనులు చేస్తున్నారని, 50 శాతం పనులు చేసి మిగిలిన పనులు కాంట్రాక్టర్ పూర్తి చేయలేదన్నారు. సాయి పావని కాంట్రాక్టర్ వారు 31 గ్రామాలలో (కక్కలపల్లి కాలనీ, పాపంపేట, సజ్జల కాలువ, చిన్నంపల్లి, ఆలమూరు, కాటిగానికాలువ, రాచానపల్లి, S.K.యూనివర్సిటీ చుట్టూ గ్రామాలు వీటితో పాటు 19 గ్రామాలు) పనులు చేస్తున్నారని, ఇందులో 50 శాతం పనులు చేశారని, మిగిలిన పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. త్రాగునీటి సమస్యలు లేకుండా చిన్న చిన్న రిపేర్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించి గ్రామాలకు నీటి సరఫరా చేయాలని సూచించారు. పీఏబీఆర్ డ్యాం దగ్గర మెయిన్ పైప్ లైన్ 600 మీటర్లు పెండింగ్ లో ఉందన్నారు. పీఏబీఆర్ డ్యాం దగ్గర ఫిల్టర్ బెడ్స్ పనులు ఇప్పటివరకు మొదలు కాలేదని, డ్యాం దగ్గర క్లియర్ వాటర్ సంపు నుండి ఆత్మకూరుకు పంపింగ్ చేసే మోటర్లు ఇప్పటివరకు ఆర్డర్ పెట్టలేదని, పి.నారాయణపురం మరియు పి.యాలేరు మధ్య హెచ్.ఎన్.ఎస్.ఎస్ కెనాల్ బ్రిడ్జి పనులు పూర్తికాలేదని, 50 శాతం పనులు జరిగాయని, ఆత్మకూరు గ్రామంలో ఓ.హెచ్.ఎస్.ఆర్ ట్యాంక్ పనులు మరియు సంపు పనులు ఇంకా పూర్తి కాలేదని, పంపురూము మరియు మోటర్లు పనులు కూడా పూర్తి కాలేదని, పంపనూరు మరియు చిన్నంపల్లి దగ్గర కట్టాల్సిన మినీ ట్యాంకుల పనులు కూడా పూర్తి కాలేదని, సత్యసాయి కార్మికులు జీతాలు రావట్లేదని, జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. త్రాగునీటి సరఫరా పనులు వేగవంతంగా చేపట్టినందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీటి సరఫరా పనులను రెండు నెలల్లో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్.నినో విపత్కర పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ పనులను రెండు నెలలలోగా వేగవంతంగా పూర్తి చేసి 30 గ్రామాలకు త్రాగునీరు అందించాలని ఆదేశించారు. మౌలిక వసతుల పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా పంపింగ్ హౌస్ వద్ద 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పంపింగ్ హౌస్ వద్ద కొత్త సాండ్ ఫిల్టర్లను అమర్చేందుకు చర్యలు చేపట్టాలని, దీనికి సంబంధించిన ఆర్డర్లను వెంటనే పూర్తి చేసి, రాబోయే 2 నెలల్లో పనులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. సబ్‌కాంట్రాక్టర్ ద్వారా కిర్లోస్కర్ కంపెనీ పంప్ సెట్ల కోసం ఆర్డర్ ప్రక్రియ వేగవంతం చేయాలని, రాబోయే 3-4 రోజుల్లో పేమెంట్లు పూర్తి చేసి, అధికారికంగా ఆర్డర్ ఖరారు చేయాలన్నారు. సాండ్ ఫిల్టర్లు, పైప్‌లైన్ల డయామీటర్ పెంపు మరియు ఇతర సాంకేతిక మార్పులకు సంబంధించిన రివైజ్డ్ వర్కింగ్ ఎస్టిమేట్లకు వారంలోగా ఎస్‌ఈ / సీఈ స్థాయి అధికారుల నుండి ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కురుగుంట మరియు సిండికేట్ నగర్ పరిధిలోని మిగిలి ఉన్న 350 మీటర్ల చొప్పున పైప్‌లైన్ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇబ్బందులు ఏవైనా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలన్నారు.​తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున, పిఏఆర్‌బి డ్యామ్ నుండే మనకు ప్రధాన నీటి సరఫరా ఆధారపడి ఉందన్నారు. ప్రతినెల ఈ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రజలకు త్రాగునీటి ఎద్దడి కలగకుండా ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే ప్రాథమిక లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి పీఏబిఆర్ దగ్గర 2.5 ఎకరాల భూమి కావలసి ఉండగా, అందులో 75 సెంట్లు ఇవ్వడం జరగగా, ఇంకా 1.75 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా, వెంటనే త్వరగా ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దానితో పాటు ఒడ్డుపల్లి సబ్ స్టేషన్ వెనుకాల పిపిటి కట్టేందుకు 10 సెంట్లు కావలసి ఉండగా వెంటనే ఇవ్వాలని రెవెన్యూ అధికారులని ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కె.శ్రీనివాసులు, రాప్తాడు డిఈ శ్రీధర్, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :