
అనంతపురము, ఆగస్టు 19 :బహుజన వేదిక న్యూస్ అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో ప్రైమరీ సెక్టార్ పై జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సమీక్ష నిర్వహించారు. ముందుగా గత ప్రైమరీ సెక్టార్ సమావేశంలో చర్చించిన అంశాలపై వివిధ శాఖ అధికారులు తీసుకున్న చర్యలను జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్-నినో పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే 68 శాతంపైగా పూర్తి కాగా, పూర్తిగా చేపట్టాలన్నారు. జిల్లాలో 502 గ్రామాల పరిధిలో 48,900 ఎకరాల్లో హాఫ్ మూన్ మోడల్ లో పంటల సాగు చేయాల్సి ఉండగా, ఇందులో పురోగతి తక్కువగా ఉందని, మరింత పెంచాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీలో (ఏపీఎఫ్ఆర్)లో రైతుల రిజిస్ట్రేషన్ మరింత చేపట్టాలన్నారు. హార్టికల్చర్ పంటల పరిధిలో ఈ క్రాప్ బుకింగ్ వచ్చే నెల 15వ తేదీలోపు పూర్తిగా చేపట్టాలని ఆదేశించారు. పురుగు మందులు, విత్తనాలకు సంబంధించి డిసిఓ పరిధిలో పిఏసిఎస్ లో ఒకటి పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టాలని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కెసిసి కార్డులు ఉన్న మస్త్యకారులకు బ్యాంకులలో రుణాలు ఇవ్వడం లేదని, రుణాలు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎల్డిఎంకి సూచించారు.ఇందులోభాగంగా ఈ ఖరీఫ్ లో మైనస్ 36 శాతం వర్షపాతం తక్కువగా నమోదు కావడం జరిగిందని, జిల్లాలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 3,43,394 హెక్టార్లకు గాను, 1,87,598 హెక్టార్లలో అనగా 55 శాతం మాత్రమే పంటల సాగు చేయడం జరిగిందని, వేరుశెనగ 30 శాతం మాత్రమే సాగు కాగా, కంది 116 శాతం సాగు కావడం జరిగిందని, ఎల్-నినో పరిస్థితుల వల్ల ఐడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు తెలియజేయదం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్, ఎపిఎంఐపి, పశుసంవర్ధక శాఖ, మార్క్ఫెడ్, మార్కెటింగ్, డ్వామా, తదితర శాఖల పరిధిలో ఆయా కార్యక్రమాల ప్రగతి గురించి జాయింట్ కలెక్టర్ సమీక్ష చేశారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాలురెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డిఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధక శాఖ జెడి ప్రేమ్ చంద్, డ్వామా పిడి సలీమ్ భాష, ఎల్డిఎం మారుతి శ్రీనివాసులు, ఏపీసీఎన్ఎఫ్ ఎస్పీఎం డా.నవీన్, కెవికె శాస్త్రవేత్త మల్లీశ్వరి, జిల్లా సెరికల్చర్ అధికారి మెహతాజి సుల్తాన్, జిల్లా ఫిషరీస్ అధికారి విజయకృష్ణ, మార్కెటింగ్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










