శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమ్మె విరమణ కలెక్టర్ చొరవతో వేతనాల చెల్లింపుపై హామీ – విధుల్లోకి చేరిన కార్మికులు

అనంతపురము సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు కార్మికుల వేతన బకాయిల సమస్యపై తొమ్మిది రోజులుగా కొనసాగిన సమ్మెకు తెరపడింది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ చొరవతో వేతనాల చెల్లింపుపై హామీ రావడంతో కార్మికులు సమ్మెను పూర్తిగా విరమించి విధుల్లోకి చేరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. తాగునీటి పథకాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఏడాది బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగారు. వేతనాలు లేక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారడంతో కార్మికులు ఆందోళనకు పూనుకున్నారు.

సమ్మె నేపథ్యంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై బోర్డు చైర్మన్, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ కార్మికులు, సీఐటీయూ, జేఏసీ నాయకులతో చర్చలు జరిపారు. BRO అధికారులతో కూడా మాట్లాడి నిధుల విషయాన్ని పరిశీలించారు. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు రూ.35 కోట్ల BRO బడ్జెట్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాల్లో ముందుగా రెండు నెలల వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అందులో ఒక నెల వేతనం ఈరోజు కార్మికుల ఖాతాల్లో జమ అయింది. మరో నెల వేతనం రేపు చెల్లించనున్నారు. మిగిలిన మూడు నెలల బకాయిలను సెప్టెంబర్ నెలాఖరులోగా చెల్లిస్తామని శ్రీ సత్యసాయి వాటర్ సప్లై బోర్డు ఇన్‌చార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాసులు, డీఈ రామారావు హామీ ఇచ్చారు.

వినాయక చవితి పండుగతో పాటు ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలకు నీటి సరఫరాకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో, అధికారులు ఇచ్చిన హామీపై నమ్మకంతో కార్మికులు సమ్మెను పూర్తిగా విరమించి విధుల్లోకి చేరారు.

తాగునీటిని అందించే పథకంలో పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం ప్రతిసారీ సమ్మె చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాగేంద్ర కుమార్ అన్నారు. ఇకపై వేతనాలు నెలనెలా సకాలంలో చెల్లించాలని, పథకాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యపై చొరవ తీసుకుని వేతనాల చెల్లింపునకు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌కు కార్మికులు, సీఐటీయూ, జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మధుసూదన్, జగదీశ్వర్ రెడ్డి, వన్నూరప్ప, శ్రీరాములు, చింతకాయల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :