
రూ.73.95 లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
కూటమి ప్రభుత్వంతో గ్రామీణ ప్రాంతాలకు కొత్త వెలుగు..ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురము అర్భన్ సెప్టెంబర్ 29: బహుజన వేదిక న్యూస్
20 ఏళ్ల సమస్యకు కేవలం 3 నెలల్లోనే పరిష్కారం చూపించామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రుద్రంపేట పంచాయతీ చంద్రబాబునగర్ లోని చైతన్య కాలనీలో నూతన సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 73.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలు మారిపోతున్నాయని.. పల్లెలకు కొత్త వెలుగు వచ్చిందన్నారు. పల్లె పండుగ 3.0 లో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మొత్తం రూ.2.35 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. వీటితో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ&విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, శరవేగంగా అడుగులు వేస్తోందన్నారు. మూడు నెలల క్రితం చైతన్య కాలనీకి పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు తమ కాలనీలో రోడ్లు లేక పడుతున్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారని.. ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం.. కేవలం 3 నెలల స్వల్ప వ్యవధిలోనే నిధులు మంజూరు చేయించి, నేడు ఇక్కడ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో ఈ చైతన్య కాలనీ స్వల్ప వర్షాలకే ముంపునకు గురయ్యేదని, ఇప్పుడు కొత్తగా సీసీ రోడ్లతో పాటు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నందున ఆ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ పల్లె పండుగ ప్రాధాన్యతను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దివాకర్, టిడిపి నాయకులు కోనంకి భక్తవత్సలం నాయుడు, బోయపాటి బాలప్ప, కదిరప్ప, వెంకటరాముడు, కొత్తకోట ఖాసీం, ఎస్ ఎం భాష, పెద్దన్న, దబ్బర నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









