పిల్లల ఆధార్ ఎంబీయూ పెండెన్సీని మూడు నెలల్లోగా పూర్తి చేయాలి

-: జిల్లాలోని ఆధార్ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం, యుఐడిఏఐ నిర్దేశించిన రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి

-: జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

అనంతపురము, సెప్టెంబర్ 07 : బహుజన వేదిక న్యూస్

జిల్లాలో పిల్లల ఆధార్ నమోదు, నవీకరణతో పాటు పెండింగ్లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేడేట్ (MBU) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ (DLAMC) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆధార్ నమోదు, నవీకరణ, పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పెండెన్సీ, ఆధార్ సేవా కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆధార్ పెండెన్సీపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలకు సంబంధించి 51,446 ఆధార్ పెండెన్సీ ఉండగా, ఈ పెండెన్సీని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, అంగన్వాడీ కేంద్రాలు, సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రతి నెల రెండుసార్లు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ శిబిరాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 5-15 సంవత్సరాల పిల్లలకు 44,221 ఎంబియూ పెండెన్సీ, జూనియర్ కళాశాలల్లో 5-17 సంవత్సరాల విద్యార్థులకు 23,535 ఎంబియూ పెండెన్సీ ఉన్నట్లు అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించి పెండింగ్లో ఉన్న ఎంబియూ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి, రీజినల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు ఆధార్ సేవా కేంద్రాల సహకారంతో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించి పిల్లల ఎంబియూ పెండెన్సీని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో గుర్తించిన ఆధార్ పెండెన్సీని రాబోయే మూడు నెలల్లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించేలా అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఆధార్ సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లకు ఆధార్ సేవల నిర్వహణ, సాంకేతిక అంశాలు, నిర్దేశిత విధివిధానాలపై అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని UIDAI అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆధార్ సేవలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు, అర్జీలు సమర్పించాలని సూచించారు.

సంబంధిత ఆధార్ సేవా కేంద్రం లేదా అధికారులకు కూడా సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని ఆధార్ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం, UIDAI నిర్దేశించిన రుసుముల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆధార్ సేవా కేంద్రంలో అందించే సేవలకు సంబంధించిన నిర్దేశిత రుసుముల వివరాలతో కూడిన పోస్టర్ ను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి బాలబాలికకు ఆధార్ నమోదు, నవీకరణ, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సేవలు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మాలోల, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు జిల్లా అధికారి జి.నాసరారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ ఖాన్, ఆర్ఐఓ వెంకట రమణ నాయక్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రమణ, UIDAI రీజినల్ ఆఫీస్, హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ దామోదర్, జిల్లా ఆధార్ నోడల్ అధికారి నారపరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ICDS అధికారులు, సిఎస్సి జిల్లా మేనేజర్ పాండు, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, లీడ్ బ్యాంక్ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :