చిన్న పత్రికల పరిరక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

పెన్షన్, ప్రమాద బీమా, ప్రకటనల్లో 30 శాతం వాటా కల్పించాలి

ఎం‌ప్యానల్‌మెంట్‌, ప్రభుత్వ కార్యక్రమాల కవరేజీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మధ్యతరహా, చిన్న పత్రికల జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

అనంతపురం, ఆగస్టు 19: బహుజన వేదిక న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యతరహా, చిన్న దినపత్రికలు, పీరియాడికల్స్‌ పరిరక్షణకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జి కవరకుంట్ల జయరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బుధవారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మధ్యతరహా, చిన్న దినపత్రికలు అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నూతన కమిటీల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెండు జిల్లాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

లోగో ఆవిష్కరించిన డీఎస్పీ

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం డీఎస్పీ చంద్రశేఖర్ హాజరై ఆంధ్రప్రదేశ్ మీడియం స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో చిన్న, మధ్యతరహా పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను ప్రజలకు చేరవేసే క్రమంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

 

విశిష్ట అతిథులుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జి కవరకుంట్ల జయరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు హాజరై మాట్లాడారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

 

చిన్న పత్రికలకు 30 శాతం ప్రకటనల వాటా ఇవ్వాలి

 

నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనల్లో మధ్యతరహా, చిన్న, ఇతర పత్రికలకు 30 శాతం వాటా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న పత్రికలకు ప్రకటనలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో చిన్న, మధ్యతరహా పత్రికలకు న్యాయమైన వాటా దక్కేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

అలాగే పత్రికల ఎం‌ప్యానల్‌మెంట్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, అర్హత కలిగిన చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనల వ్యవస్థలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తల కవరేజీలో చిన్న పత్రికల ప్రతినిధులకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

 

జర్నలిస్టులకు పెన్షన్, ప్రమాద బీమా కల్పించాలి

 

సుదీర్ఘకాలంగా జర్నలిజం రంగంలో సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురయ్యే జర్నలిస్టులు, వారి కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.

 

చిన్న పత్రికలు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో ముందుంటున్నప్పటికీ వాటికి అవసరమైన ఆర్థిక, సంస్థాగత సహకారం అందడం లేదన్నారు. చిన్న పత్రికల పరిరక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పత్రికల అభివృద్ధితో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి సమగ్ర విధానం రూపొందించాలని కోరారు.

 

చిన్న, మధ్యతరహా పత్రికల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, పత్రికల మనుగడ, ప్రకటనలు, ఎం‌ప్యానల్‌మెంట్‌, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై సంఘటితంగా ఉద్యమిస్తామని తెలిపారు.

 

అనంతపురం జిల్లా నూతన కమిటీ

 

ఆంధ్రప్రదేశ్ మధ్యతరహా, చిన్న దినపత్రికలు అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనంతపురం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

గౌరవ అధ్యక్షులు: శంకర ప్రసాద్ (తెలుగోడు)

 

జిల్లా అధ్యక్షులు: డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ (ధర్మ విజేత)

 

ఉపాధ్యక్షులు: లోకేష్ (అనంత కోకిల), రామాంజినేయులు (మనం), జోడు రమేష్ (కదిలించే వార్త)

 

ప్రధాన కార్యదర్శి: కే. శ్రీరాములు (నారి-భేరి)

 

సహాయ కార్యదర్శులు: పి. రామాంజనేయ ప్రసాద్ (శింగనమల ప్రసాద్) — బహుజన వేదిక తెలుగు జాతీయ దినపత్రిక, నాగేంద్ర (అనంత కళా వేదిక), శరత్ కుమార్ రెడ్డి (అక్షర ప్రభ)

 

కోశాధికారి: జీ. ఆనంద్ (అక్షయ న్యూస్)

 

కార్యవర్గ సభ్యులు: సీనియర్ జర్నలిస్టులు సుబ్బయ్య (ప్రజాబాట), సంజీవరెడ్డి (సాయంకాలం), భూపాలం సతీష్ కుమార్ (వినియోగ దర్శిని), భాస్కర్ (జన సూర్య), భాస్కర్ (మనం), నరసింహమూర్తి (నలివేటి ఎక్స్‌ప్రెస్), హరికృష్ణ (అనంత సూర్య), బాలరాజు (జన సూర్య) ఎన్నికయ్యారు.

 

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు: సిరిసాల సురేష్ (నేషలిస్ట్ హాబ్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీ

 

శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

జిల్లా గౌరవ అధ్యక్షులు: ఎన్. నారాయణ (రాయల్ న్యూస్ పక్షపత్రిక, హిందూపురం)

 

జిల్లా అధ్యక్షులు: బి. రవీంద్రనాయక్ (వాయిస్ ఆఫ్ విక్టరీ ఎడిటర్, కదిరి)

 

జిల్లా ప్రధాన కార్యదర్శి: కే.ఎన్. నాగరాజు (పల్లె జీవనం మాసపత్రిక ఎడిటర్, మడకశిర)

 

జిల్లా ఉపాధ్యక్షులు: సాకే శ్రీనివాసులు (జనతరంగం డైలీ ఎడిటర్, ధర్మవరం), కోలా బ్రహ్మయ్య (సంధ్యవేళ సాయంకాలం ఎడిటర్, కదిరి)

 

జాయింట్ సెక్రెటరీ: పి. మల్లిక (జాబిలి మాసపత్రిక ఎడిటర్, పెనుగొండ)

 

కోశాధికారి: పి. మహబూబ్ బాషా (ఆంధ్ర ప్రతి దినపత్రిక సబ్‌ఎడిటర్, కదిరి) ఎన్నికయ్యారు.

 

జర్నలిస్టుల సమస్యలపై ఐక్య పోరాటం

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మండల, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో స్థానిక పత్రికల పాత్ర ఎంతో కీలకమన్నారు. అలాంటి పత్రికలు ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

పత్రికల పరిరక్షణతో పాటు అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, ప్రమాద బీమా, పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చిన్న పత్రికలకు ప్రభుత్వం నుంచి లభించే ప్రకటనలు, అధికారిక సమాచారం, మీడియా గుర్తింపు తదితర అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షులు తలారి రామాంజనేయులు, జిల్లా నాయకులు డాక్టర్ సూర్య, సీనియర్ జర్నలిస్టులు ఆజాద్, సుబ్బయ్య, శంకర ప్రసాద్, బాబ్జాన్, సురేష్, శ్రీరాములు, ఓ. భాస్కర్, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, రామ్మూర్తి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :